టీఆర్ఎస్‌ టికెట్ల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలుసా..

-

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. అధికార పార్టీకే ఎడ్జ్ ఉంద‌న్న సంకేతాల నేప‌థ్యంలో చాలా మంది ఆ పార్టీ నేత‌లు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి త‌మ అదృష్టం ప‌రీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆశావాహుల సంఖ్య ఎక్కువుగా ఉండ‌డంతో ఎవ‌రికి టిక్కెట్లు ఇవ్వాలో తెలియ‌క టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల కోసం ఏపీలో అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగ‌డ‌మే ఇక్క‌డ విశేషంగా మారింది.

ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కూడా టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు వస్తున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ చుట్టూనే 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 17 మున్సిపాల్టీలు ఏర్పడ్డాయి. గ్రేట‌ర్ చుట్టుప‌క్క‌ల నిజాంపేట‌, మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్, నార్సింగ్, పెద్ద అంబర్ పేట, బడంగ్ పేట, మీర్ పేటలో కొన్ని వార్డుల్లోనూ ఏపీకి చెందినవాళ్లే ఎక్కువుగా ఉన్నారు. వీరంతా అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులుగా ఎదిగారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరి స్థానిక లీడ‌ర్లుగా ఎదిగారు.

ఈ క్ర‌మంలోనే ఏపీకి చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్క‌డ ఉన్న త‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు, న‌మ్మిన‌బంట్ల‌కు టిక్కెట్ల కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ఒత్తిళ్లు ఎక్కువ‌వుతున్నాయ‌ట‌. నిజాంపేట కార్పొరేషన్లో టీఆర్ఎస్ టికెట్ కోరుతున్నవారు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద వెంట, మరో వర్గం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వెంట ఉన్నారు. ఇక్క‌డ ఆంధ్రా ప్ర‌భావం ఎక్కువుగా ఉండ‌డంతో ఈ ఇద్ద‌రు నేత‌ల‌పై తమ వారికి టిక్కెట్లు ఇవ్వాల‌ని ఏపీ నేత‌ల నుంచి తీవ్ర‌మైన ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ట‌.

రాయ‌ల‌సీమ జిల్లాల‌కు చెందిన ఓ మంత్రితో పాటు ఆంధ్రా ఏరియాకు చెందిన మ‌రో మంత్రితో పాటు కొంద‌రు ఎమ్మెల్యేలు ఇక్క‌డ టీఆర్ఎస్ నేత‌ల‌పై టిక్కెట్ల కోసం ఒత్తిళ్లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. తాము చెప్పిన వాళ్ల‌కు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారని, డబ్బులు ఎంత ఖర్చయినా తాము పెట్టుకుంటామంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version