తెలంగాణకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటీవల కాలంలో క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షం ప్రభావంతో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
తూర్పు, ఆగ్నేయ ప్రాంతం భారత దేశం నుంచి తెలంగాణలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అదనంగా నమోదు అవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 38.9, అత్యల్పంగా సిర్పూర్ లో 18.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 -38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లా బట్వారంలో 3.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34-36 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 19-21 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది.