ఓట్ల లెక్కింపు కోసం 119 మంది పరిశీలకులు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇవాళ్టితో ఈవీఎంల తనిఖీ ముగియనుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రానికి 119 మంది పరిశీలకులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించిందని వివరించారు. సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకులు 166 మంది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణకు మరో ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కూడా ఎన్నికల సంఘం పంపిందని వికాస్ రాజ్ వెల్లడించారు. సర్వీసు ఓటర్లకు ఎలక్ట్రానిక్‌ విధానంలో బ్యాలెట్‌ పత్రాలు పంపుతున్నట్లు చెప్పిన ఆయన.. ఇప్పటివరకు 9,813 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. వాటిని ప్రింటు తీసుకుని, ఓటు వేసి.. పోస్టు ద్వారా లెక్కింపు నాటికి పంపాల్సి ఉంటుందని వివరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. పరిశీలకుడి ఆమోదం తర్వాతే ప్రతి రౌండ్‌ వివరాలు ప్రకటిస్తారుని.. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version