ఓటర్ల తుది జాబితాపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు శనివారం రోజున ప్రకటన విడుదల చేశారు. గత నెల 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నారని.. కొత్తగా 8 లక్షల ఓటర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.
ఇక 4.14 లక్షల ఓటర్లను తొలగించినట్లు తెలిపారు సుదర్శన్ రెడ్డి. యువ ఓటర్లు 4, 73, 838 మంది నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 551 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,907 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు సుదర్శన్ రెడ్డి. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను ఈనెల 27 వరకు స్వీకరిస్తామని తెలిపారు.
జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని.. ఈనెల 9,10 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బిఎల్వో లు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏఎస్టి లకు ఓటు హక్కు లేదని తెలిపారు.