కులగణన సర్వే సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. కుల గణన బృహత్తర కార్యక్రమమని.. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాస్తవానికి జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నామని ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. అది నిరూపించుకునేందుకు ఈ సర్వే చాలా కీలకం కానుంది.
ఈ గణన ద్వారా బీసీలతో పాటు అన్ని కులాల జనాభా లెక్కలు వారి ఆర్థిక స్థితి గతులు తెలుస్తాయి. ఎవ్వరి ఒత్తిళ్లకు కూడా లొంగకుండా మా దృష్టికి వచ్చిన విషయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కులగణన జరుగుతున్న సమయంలో కుల సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. సర్వే సక్రమంగా జరిగేవిధంగా చూడాలన్నారు. 80వేల నుంచి 90వేల మంది ఎన్యుమరేటర్లు జనగణనలో పాల్గొంటారని తెలిపారు. దీనిని ఎవ్వరూ కూడా రాజకీయం చేయకూడదని సూచించారు.