తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో ప్రచార గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ నేతలను రంగంలోకి దింపింది. ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఇక మరోమారు వారు రాష్ట్రానికి రానున్నారు. అమిత్ షా ఇవాళ వస్తుండగా.. మోదీ రేపటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బహిరంగ సభకు హాజరు కానున్నారు. అనంతరం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఈ రోడ్‌షోల అనంతరం తిరిగి దిల్లీ బయల్దేరి.. మళ్లీ ఒక్క రోజు విరామం తరువాత 26,27,28వ తేదీలలో రాష్ట్రంలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మేడ్చల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం కార్వాన్, కంటోన్‌మెంట్‌లో రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించనున్నారు.