రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు వరస కట్టనున్నారు. ఇవాళ ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జనగర్జన సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభ అనంతరం సికింద్రాబాద్‌లో మేధావుల సమావేశానికి ఆయన హాజరవుతారు. మేధావుల సమావేశం అనంతరం… బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై… ఎన్నికల వ్యూహాలపై అమిత్‌షా దిశానిర్ధేశం చేయనున్నారు.
మరోవైపు ఈనెల 14న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో.. కేంద్రమంత్రి పీయుష్ గోయల్ పర్యటిస్తారు. 15న కేంద్రమంత్రి సాద్వి నిరంజన్‌జ్యోతి.. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. 16న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హుజూరాబాద్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 19వ తేదీన… మధిర నియోజకవర్గం పరిధిలో కేంద్రమంత్రి నారాయణస్వామి పర్యటించనున్నారు.
నేడు అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
- దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి 1:45కి చేరుకుంటారు.
- అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ బయల్ధేరి వెళ్లనున్నారు.
- మధ్యాహ్నాం 3 నుంచి 4 గంటలకు వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
- బహిరంగ సభ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి 5 గంటలకు చేరుకుంటారు.
- బేగంపేట విమానాశ్రయం నుంచి ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లి సాయంత్రం 6 గంటల వరకు సేద తీరనున్నారు.
- ఐటీసీ కాకతీయ నుంచి సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లోని ఓ వేడుకల మందిరంలో నిర్వహించే మేధావుల సమావేశానికి హాజరవుతారు.
- 6:20 నుంచి 7:20 వరకు మేధావులతో సమావేశమై పలు సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
- మేధావుల సమావేశం అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ కు చేరుకుంటారు.
- రాత్రి 7:40 నుంచి 8:20వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
- రాత్రి భోజనం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి రాత్రి 9:35కి తిరిగి దిల్లీ బయల్ధేరి వెళ్లనున్నారు.