బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తెలంగాణ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు సినీతారలకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసులో పోలీసుల నోటీసులు అందుకున్న వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ఇవాళ పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
పోలీసుల విచారణ అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు అని.. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయనని స్పష్టం చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటం వల్ల దానిపై తాను ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు. తనకు చట్టంపై నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు సహకరిస్తానని వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని ఇటీవల శ్యామల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆమెను చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.