ఈనెల 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి, రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 240 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆదివారం కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక ఇవాళ్టి నుంచి నామినేషన్ల దాఖలు వేగవంతం కానుంది. మంచి రోజు కావడంతో ఇవాళ పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 10వ తేదీ వరకే గడువు ఉంది. మంచిరోజులు కావడం, ముహూర్తాలు ఉండడంతో నేడు, ఈనెల 9వ తేదీన భారీగా నామినేషన్లు వేయవచ్చని అంటున్నారు.
మరోవైపు ఈరోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి, ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇంకోవైపు కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ నామపత్రాలు సమర్పించనున్నారు. వీరే కాకుండా ఇవాళ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి కీలక అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.