హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఉదయం భారీ ప్రమాదం తప్పింది. చెన్నె నుంచి హైదరాబాద్ వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరాడు. వెంటనే ఎయిర్ పోర్టు అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫన్ను నిలిపివేశారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేయగలిగాడు. సమస్య తలెత్తిన సమయంలో కార్గో విమానంలో మొత్తం 6 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన విమానాశ్రయంలో కాసేపు భయాందోళన కలిగించింది. విమానం ల్యాండింగ్ గేర్ సమస్యను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారు.
ఇక మరో ఘటనలో, హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న అమీర్ అహ్మద్ అనే ప్రయాణికుడి వద్ద అనుమానాస్పద రీతిలో 22.75 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా విదేశీ కరెన్సీ తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.