హైదరాబాద్ నగరంలో వివాహిత అనుమాన స్థితిలో మృతి చెందిన ఘటన నగర పరిధిలోని మలక్ పేటలో చోటు చేసుకుంది. శ్రీశైలం సమీపంలోని దోమలపెంటకు చెందిన సింగం శిరీష తన భర్త వినయ్ కుమార్ తో కలిసి మలక్ పేటలోని జమునా టవర్స్ లో నివాసం ఉంటుంది. ఇవాళ ఉదయం ఉన్నట్టుండి శిరీష గుండెపోటుతో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులకు భర్త వినయ్ కుమార్ సమాచారం అందించారు. శిరీష తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని స్వగ్రామం దోమలపెంటకు భర్త తరలించే యత్నం చేశాడు.
ఈ క్రమంలో శిరీష కుటుంబ సభ్యులు చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శిరీష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. వినయ్ కుమార్ తో పాటు అతని సోదరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. తాను సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణం దక్కలేదని చనిపోయిందని వినయ్ కుమార్ సోదరి పేర్కొనడం గమనార్హం. మరోవైపు పోస్టుమార్టం చేసిన రిపోర్టులో శిరీషది సహజ మరణం కాదు.. హత్య చేసినట్టు తేలింది. దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు భర్త వినయ్. హత్య చేసి హార్ట్ ఎటాక్ కథ అల్లాడు భర్త అని వైద్యులు ధృవీకరించారు.