తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శంకరమ్మ పేరు ప్రచారం చేసుకుని ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కష్టపడేవారికి ఆ పార్టీలో గుర్తింపు లేదని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అయినా ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలని అన్నారు. ఉద్యమకారులకే సీట్లు ఇస్తామని అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్, హరీశ్‌రావు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
“బీఆర్ఎస్లో వందల కోట్లు సంపాదించిన వారికే సీట్లు ఇస్తారు. సీట్లు అమ్ముకుందాం.. డబ్బు దండుకుందాం.. ఆ పార్టీకి ఎప్పుడు ఇదే ఆలోచన. అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్లో అన్యాయం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నాయని దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు ఎవరితో పొత్తులు పెట్టుకోం. అయోధ్య కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాలేదు. ముందు కార్యకర్తలకు మీ పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం నేర్చుకోండి.” అంటూ బీఆర్ఎస్ పార్టీపై రఘునందన్ రావు ధ్వజమెత్తారు.