ఖమ్మం జిల్లా వరసు ఇంజక్షన్ మర్డర్లు కలకలం రేపుతున్నాయి. మొన్న ఓ భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఇంజక్షన్ సాయంతో భర్తను చంపించింది. నిన్న ఓ భర్త.. తన భార్యలిద్దరు తరచూ గొడవ పడుతున్నారని రెండో భార్యకు ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు. ఈ రెండు ఘటనలు జిల్లాలో తీవ్ర దుమారం రేపాయి. ఇంజక్షన్ గురించి చర్చ వస్తేనే స్థానికులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే కాలేజ్ కు వెళ్లడానికి ఆటో ఎక్కిన ఓ విద్యార్థి.. ఆటోలో ఉన్నవాళ్లు ఇంజక్షన్ గురించి మాట్లాడుకుంటుండగా భయపడి అందులో నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు.
అసలేం జరిగిందంటే.. నేలకొండపల్లి మండలం అజయ్‌తండాకు చెందిన బానోత్ గోపి నేలకొండపల్లిలో ఇంటర్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు అజయ్‌తండాలో చెరువుమాదారం నుంచి వస్తున్న ఓ ఆటో ఎక్కాడు. ఆటోలో ఓ వ్యక్తి, వృద్ధుడు, బాలుడు ఉన్నారు. బాలుడు వెనుక సీటులో పడుకొని ఉన్నాడు. డ్రైవరుకు ఆటోలో ఉన్న వ్యక్తికి మధ్య సూది ఘటనపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వారిని చూసి భయపడిన గోపి ఆటో ఆపాలని అభ్యర్థించాడు. వారు ఆపకుండా అలాగే వెళ్లడంతో ‘వెనుక ఉన్న బాలునికి సూది వేసి పడుకోబెట్టి ఉండొచ్చు, నాకు కూడా సూది వేస్తారేమో’నని అనుమానపడ్డాడు.
అదే సమయంలో వృద్ధుడు సంచిలో చేయి పెట్టాడు. వారు కచ్చితంగా తనకు సూదిమందు వేస్తారని భయపడి ఆటో నుంచి దూకాడు. దీంతో ఆటో కూడా పల్టీ కొట్టింది. గోపికి గాయాలయ్యాయి. అక్కడ నుంచి పారిపోయి అజయ్‌తండా చేరుకొన్నాడు. ప్రస్తుతం గోపి ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.