మంచి ఉపాధ్యాయురాలు ఆమె.. బాధ్యతగా పాఠాలు చెప్పడమే కాదు చనిపోతూ చనిపోతూ ఇంకొందరి ప్రాణాలు కాపాడారు. జీవితాన్ని ఇచ్చారు. సంస్థాన్ నారాయణ పురం మండలానికి చెందిన 45 ఏళ్ల విజయలక్ష్మీ టీచర్ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి. ఇటీవల ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. వైద్యులు ఆమె ప్రాణాలకు భరోసా ఇవ్వలేమని తేల్చేశారు.దీంతో ఇంతటి విపత్కర సమయంలో కూడా ఆమె అవయవదానానికి ఆ కుటుంబం ముందుకు వచ్చింది. ఆదర్శంగా నిలిచింది. ఓ గురువుగా ఆమె బాధ్యత మంచి సమాజం నిర్మాణం చేయడం.. అదేవిధంగా అంతకుమించిన బాధ్యతతో తోటి వారికి అండగా నిలిచి ప్రాణదాత కావడం.. ఆధునిక కాలంలో ఎవరికి ఎవరో ! కానీ ఈ కుటుంబంకు మాత్రం అందుకు భిన్నం.
ప్రాణాలు పోతున్నా మరో మనిషికి జీవితాన్ని ఇవ్వడంలో ఆనందం ఉంది. ఆనందం కన్నా బాధ్యతే ఎక్కువ ఉంది. ఆ ఉపాధ్యాయురాలి జీవితం ఇందుకు ఓ ఉదాహరణ. తన ప్రాణాలు పోతున్నా ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన వైనం ఎందరికో ఆదర్శం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ ఉపాధ్యాయురాలి పేరు జక్కిడి విజయలక్ష్మి. నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ లో పనిచేస్తున్నారు. ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానానికి కుటుంబం ముందుకు వచ్చింది.
పుట్టెడు దుఃఖంలో ఉన్నా ఇతరుల ప్రాణాలను కాపాడాలన్న ఆలోచనతో ఈ గొప్ప పనికి అంగీకరించింది. దీంతో ఆమె దేహం నుంచి కిడ్నీలు, కాలేయం, కంటికి సంబంధించి కార్నియాలు సేకరించారు. వీటి సాయంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవయవ దానంపై మరికొందరు అవ గాహన పెంచుకుంటే ఇంకొందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండడం ఖాయం.