చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం నేడు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. 2014, 2018 ఎన్నికల సమయంలో బీజేపీ తమ మేనిఫెస్టోల్లో రెండు సార్లు హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇందుకు నిరసనగా దిల్లీలో ఇవాళ దీక్ష చేపడతామన్నారు. ఇందుకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామని.. సహకరించాలని కవిత కోరారు.
”త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టాలి. ఆ బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించాలి. ఇదే డిమాండ్‌తో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు దీక్ష చేస్తున్నాం. ఇందుకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నాం. అందరూ సహకరించాలని కోరుతున్నాం.” – కవిత
అయితే మొదట జంతర్ మంతర్ వద్ద కవిత దీక్షకు పోలీసులు అనుమతించారు. జంతర్ మంతర్ వద్ద దీక్షకు సాంకేతిక కారణాలతో పర్మిషన్ రద్దు చేస్తున్నట్లు గురువారం మధ్యాహ్నం పోలీసులు కవితకు సమాచారం అందించారు. దీంతో జాగృతి ప్రతినిధులు పోలీసులతో సంప్రదింపులు జరపగా.. చర్చల అనంతరం దీక్షకు ఓకే చెప్పారు. ఈ మేరకు మౌఖికంగా అనుమతి ఇచ్చారు.