తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ భేటీ లో కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి పండుగ తరువాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించారు.
తెలంగాణ కొత్త రేషన్ కార్డుల కోసం సుదీర్ఘ కాలం నుంచి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 90 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. వీటికి అదనంగా మరో 15 లక్షల కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు కోటీ రేషన్ కార్డులు జారీ చేసే అవకాశముంది. రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలు రూ.500 కే గ్యాస్, ఉచిత విద్యుత్ అందించాల్సి రావడంతో కొన్ని అర్హతలను నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణాల్లో అయితే రూ.2లక్షలు లోపు ఆదాయం ఉన్నవారికే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.