ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇంత త్వరగా దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం నిజంగా గర్వకారణం అని తెలిపారు. గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో అయిదారెకరాలు కొనే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొంటున్నారంటూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఇటీవల అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. పరిస్థితులు తారుమారయ్యాయని.. రెండు రాష్ట్రాల భూముల ధరల్లో తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయని వెల్లడించారు. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వంతో తెలంగాణ భూముల ధరలెట్లా పెరిగాయో అందరికీ తెలుసన్నారు.
తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని సమైక్యశక్తులు అప్పట్లో ప్రజలను గందరగోళానికి గురిచేశాయని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ రోజు పటాన్‌చెరులో ఎకరా రూ.30 కోట్లు పలుకుతోందన్నారు. ఆ లెక్కన ఇక్కడ ఎకరా అమ్మితే.. ఆంధ్రాలో వందెకరాలు కూడా కొనొచ్చని కేసీఆర్ అన్నారు.