దేశవ్యాప్తంగా కేంద్రం 157 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిందని.. కానీ ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టంలో ఉందని.. అయినా తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వకుండా చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? అని నిలదీశారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
“కేంద్రం వద్ద అప్పులు తెచ్చి సింగరేణిలో కేంద్రానికి వాటా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. సింగరేణి కార్మికులు ఇళ్లు కట్టుకుంటే రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తున్నాం. ప్రజల కట్టే పన్నులు రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నాం అని కాంగ్రెస్ అంటోంది. రైతుబంధు దుబారానా? మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రైతుబంధు రూ.16 వేలకు పెంచుతాం. రైతులకు 3 గంటల కరెంట్ చాలు అని రేవంత్‌రెడ్డి అంటున్నారు.. రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందా? ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తాం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి? ధరణి వల్ల అర్ధగంటలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో రిజిస్ట్రేషన్లు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం రైతు బొటనవేలు పెడితేనే భూయాజమాన్య హక్కులు మారతాయి.” అని కేసీఆర్ అన్నారు.