శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న సిబ్బంది క్షేమంగా తిరిగిరావాలని సీఎం కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, టీఎస్ జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావుతో ఆయన మాట్లాడారు. సిబ్బందిని కాపాడేందుకు చేపడుతున్న సహాయక చర్యలను అడిగితెలుసుకున్నారు.
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధుల్లో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. 8 మంది ఉద్యోగులు సొరంగం నుంచి బయటకు పరుగులు తీయగా మిగిలిన 9 మంది ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు. వీరిలో 7 గురు జెన్‌కో ఉద్యోగులు కాగా ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.