తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు ఆయన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో పర్యటించి.. అక్కడ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా.. అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను చూసి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.
“బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టింది. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలి. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారు. కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టి ఉండేది. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపి ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా.. బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీని చీల్చే ప్రయత్నం చేసింది.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.