గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమకు వచ్చిన ఓట్ల శాతాన్ని బీజేపీకి బదిలీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 22 శాతం ఉన్న బీఆర్ఎస్ ఓట్లను కమలం పార్టీకి బదిలీ చేసిందని అన్నారు. లోక్‌సభ ఫలితాలపై సీఎం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చిందని.. కానీ అక్కడి ఓట్లను హరీశ్‌రావు రఘునందన్ రావుకు వేయించాలని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బీజేపీకి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. గులాబీ పార్టీ అచేతనావస్థలో ఉందని.. ఆ పార్టీకి ఇక మిగిలింది బూడిదేనని విమర్శించారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న బీఆర్ఎస్ కుట్రను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు.
“కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు తమ వ్యవహారశైలిని మార్చుకోవాలి. పార్టీ మనుగడకు, కుటుంబ స్వార్థం కోసం చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రంలో 2014, 2019లో బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో మోదీ గ్యారంటీని దేశ ప్రజలు తిరస్కరించారు. మోదీ కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రధాని పదవికి తక్షణమే మోదీ రాజీనామా చేయాలి.” అని రేవంత్ రెడ్డి అన్నారు.