కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించినా ఫలితం ఉండబోదని జేడీఎస్ నేత హెచ్చీ కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం ఎన్డీయే కూటమి సమావేశానికి వెళ్లే ముందు ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
తమకు విజయం అందించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలోని 28 లోక్సభ స్థానాలకు గాను 19 స్థానాలు ఎన్డీయేకు దక్కాయి. బీజేపీ 17, జేడీఎస్ 2 స్థానాల్లో గెలుపొందింది. మాండ్యా నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన కుమారస్వామి విజయం సాధించారు. అలాగే మరో జేడీఎస్ నేత కోలార్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మరోవైపు తమ పార్టీ ఎన్డీయేతోనే ఉందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు. ఇండియా కూటమిలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని వెల్లడించారు.