బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత పదేళ్లలో వరదలు వచ్చినప్పుడు ప్రజలను పరామర్శించేందుకు కేసిఆర్ ఒక్కరోజైనా గ్రామాలలోకి వచ్చారా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా భారీ వరదలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వరదల్లో తిరుగుతుంటే.. ఇక్కడ కేసీఆర్ మాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు.
అసలు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఉన్నాడా..? ఉంటే ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. గతంలో మాసాయిపేటలో పసిపిల్లలు చనిపోతే కేసిఆర్ పరామర్శించలేదని, హైదరాబాద్ శివారులో పశువైద్యురాలిని హత్య చేస్తే కనీసం వెళ్లి చూడలేదని విమర్శించారు. మానవత్వం లేని మనిషి కేసీఆర్ అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
అమెరికాలో ఉండి కూడా కేటీఆర్ మంత్రులపై విమర్శలు చేస్తున్నారని.. అధికారులు, మంత్రులు నాలుగు రోజులుగా వరద సహాయక చర్యలో పాల్గొంటున్నారని తెలిపారు. కష్టాలలో ఉన్న ప్రజలను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని తెలిపారు.