పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత నెల 30వ తేదీన ప్రారంభమైన శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు ఏప్రిల్ 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఆలయంలో శ్రీసీతారామ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా భద్రాచలానికి వెళ్లనున్నారు. రాముల వారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున శ్రీసీతారామచంద్ర స్వామికి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. స్వామి వారి కళ్యాణోత్సవాన్ని కుటుంబంతో కలిసి తిలకించనున్నారు. అనంతరం సీఎం రేవంత్.. పట్టణంలోని సన్న బియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేయనున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, అధికారులు ఉండనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రాచలంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.