తెలంగాణలో భారత్ దాల్ బ్రాండ్ కింద సాధారణ పప్పును విక్రయించారనే ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. సబ్సిడీపై విక్రయించాలని శనగ పప్పును పంపితే దాని బదులు సాధారణ పప్పు విక్రయించినట్లు వచ్చిన ఈ ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగ వ్యవహారాల శాఖ రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీగా ఉన్న హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం (హాకా)ను ఆదేశించింది.
భారత్ దాల్ పథకం కింద కేంద్ర సర్కార్ తెలంగాణలో 50 వేల టన్నుల శనగ పప్పును విక్రయించేందుకు హాకాను నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేసింది. కిలో సబ్సిడీ ధర రూ.60 చొప్పున విక్రయించేందుకు నిల్వలు పంపగా.. గత అక్టోబరు 1వ తేదీ నుంచి హాకా విక్రయాలు ప్రారంభించింది. కేంద్రం పంపిన పప్పు కాకుండా హాకా వద్ద ఉన్న నిల్వలను ఇదే బ్రాండ్ కింద విక్రయించారని కొందరు వ్యాపారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్‌కుమార్ దీనిపై వివరణ ఇవ్వాలని హాకా ఎండీకి లేఖ రాశారు.