Telangana: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ కేంద్రంలో యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి యత్నం జరిగింది. ఈ కేసులో ముస్లిం వ్యక్తి నిందితుడిగా ఉన్నారు. దీంతో అతనికి శిక్ష పడాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం బంద్ కు కూడా పిలుపునిచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు జైనూర్ లో చోటు చేసుకున్నాయి. దీంతో జైనూర్‌లో 144 సెక్షన్ విధించినట్లు ప్రకటించారు కొమురం భీం అసిఫాబాద్ జిల్లా పోలీసులు.
గత మూడు రోజుల క్రితం జైనూర్ కేంద్రంలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని,ఇట్టి క్రమంలో గాయపడిన మహిళను హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స చేయించడం జరుగుతుంది. ఆమెపై దాడి చేసిన నిందితుడిపై చార్జి షిటు ఫైల్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు తెలియజేశారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి జిల్లాలో శాంతిని నెలకొల్పాలని తెలియజేశారు. శాంతి పరిరక్షణలో భాగంగా జైనూర్లో జిల్లా కలెక్టర్ గారి ద్వారా 144 సెక్షన్ విధించడం జరిగిందని, కావున ప్రజల వారు కూడా గుమి కూడడం, ధర్నాలు చేయడం, రాస్తారోకోలు నిర్వహించడం లాంటివి చేయకూడదని, ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. జైనూర్ కేంద్రంలో శాంతి భద్రతలో పరిరక్షణలో భాగంగా కేంద్ర బలగాలైనటువంటి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేటాయించడం జరిగిందని, దానితోపాటు రాజన్న సిరిసిల్ల , జగిత్యాల జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది కూడా జిల్లాకు రానున్నట్లు తెలిపారు.