రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే క్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల నమోదు తో పాటు పాత కార్డుల సవరణలో కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా ప్రజలు తమ పేర్లు నమోదు కొరకు ప్రజాపాలన, గ్రామసభల్లో, మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకున్నారు. కానీ కార్డులలో తమ వారి పేర్లకు బదులు సంబంధం లేని వారి పేర్లు నమోదు అయ్యాయి.
ముఖ్యంగా ఒక కుటుంబానికి సంబంధించిన కార్డులో సంబంధం లేని వ్యక్తుల పేర్లు, ఒక కార్డులో వారికి సంబంధించి వేరే మండలానికి చెందిన కుమార్తె పిల్లల పేర్లు, మరో వ్యక్తి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా.. తమ భార్య, పిల్లల పేర్లు అత్తగారింటి కార్డులో, తనది తన తల్లిగారింటి కార్డులో నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పై అధికారులను ప్రశ్నిస్తే.. జిల్లా సివిల్ సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలపడం గమనార్హం.