తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో మరోసారి వివాదం రేగింది. ఇటీవల పాలకమండలి సమావేశంలో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ విద్యావర్ధినిని తప్పించి.. ఆచార్య యాదగిరిని నియమించారు. దీనిని వ్యతిరేకించిన ఉపకులపతి ఆచార్య రవీందర్ హైకోర్టును ఆశ్రయించడంతో నాటి పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను నిలిపేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఉపకులపతి ఉస్మానియా వర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతిగా ఉన్న నిర్మలాదేవిని రిజిస్ట్రార్‌గా నియమించారు. ఏడాది పదవీకాలానికి ఆర్డరు ఇవ్వడంతో ఆమె బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు. అయితే కాసేపటి తర్వాత నిర్మలాదేవి రిలీవ్ ఉత్తర్వులను ఉస్మానియా వర్సిటీ రద్దు చేయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ వర్సిటీలో గత 20 నెలల్లో అయిదుగురు రిజిస్ట్రార్లు మారారు.
నిర్మలాదేవి ఉస్మానియా వర్సిటీలో రిలీవ్ అయిన వెంటనే తెలంగాణ వర్సిటీలో రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంతసేపటికే ఆమె రిలీవ్ ఆర్డర్‌ను రద్దు చేస్తున్నట్లు ఉస్మానియా రిజిస్ట్రార్ ప్రకటించారు. మరోవైపు తనను రిలీవ్ చేయడం వల్లే ఇక్కడికి వచ్చి చేరానని నిర్మలాదేవి అన్నారు. ఏడాది వరకు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పారు.