గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకంపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

-

తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంద్రసేనా రెడ్డి నియామకంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకంపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ సీఈసీ రాజీవ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం నుంచి వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం సరికాదని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యని ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని ఈసీని కోరారు.

ఇక ఇంద్రసేనా రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మలక్​పేట నియోజకవర్గానికి సేవలందించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకమయ్యారు. వి.రామారావు, సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయల తర్వాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంద్రసేనారెడ్డి నియామకంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గవర్నర్ల సంఖ్య మూడుకు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version