కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల్లో 50 వేషాలు వేసింది అని మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చొప్పదండిలో పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఆయన.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలని దేవుడిని ప్రార్థించానని చెప్పారు. ఉమ్మడి ఏపీలో కొండగట్టును ఎవ్వరూ పట్టించుకోలేదని.. కేసీఆర్ వల్లనే రాష్ట్రంలో ఆలయాలన్నీ అభివృద్ధి చెందాయని తెలిపారు. కొండగట్టు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.500 కోట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుకు చేశారు మల్లారెడ్డి.
తెలంగాణ అన్నింటిలో నెంబర్ వన్ అని చెప్పారు. ప్రతీ గ్రామంలో ట్రాక్టర్, డంపింగ్ యార్డు అన్ని కల్పించింది కేసీఆర్ అన్నారు. తెలంగాణలో పెద్దలందరూ నా పెద్ద కొడుకు కేసీఆర్ అంటారు. రైతుల గోసను పట్టించుకున్నది కేసీఆర్ మాత్రమే అని.. అందుకే రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా వంటివి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఒకప్పుడు వలస పోయిన వారంతా తిరిగి తెలంగాణకు వచ్చారు. కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేశారని పేర్కొన్నారు. తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సుమారు 25 లక్షల మంది 15 రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కి వలస వచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ అన్నారు.