టూరిజం పై చర్చకు తొందర ఏముందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటన పై చర్చకు రెండు రోజులుగా పట్టుబడుతున్నా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు. సభా నియమాలపై నీతులు చెబుతూ ప్రభుత్వమే ఉల్లంఘిస్తోందని విమర్శించారు. పాలకపక్షం ప్లకార్డులు లోనికి తెస్తే స్పీకర్ ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
నిరసనల మధ్య బిల్లులు ఆమోదించుకున్నారని సెటైర్ వేశారు. ప్రతి పక్షాన్ని ఎదుర్కొనే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు టూరిజం పై చర్చకు తొందర ఏముందని ప్రశ్నించారు. లగచర్ల రైతుల జైలులో మగ్గుతుంటే సీఎం, మంత్రులు జల్సాలో మునిగి తేలుతున్నారని కీలక ఆరోపణలు చేసారు. లగచర్ల ఘటన విషయంలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు.