తడిసిన వడ్లను సైతం కొంటామని ప్రకటన చేశారు మంత్రి ఎర్రబెల్లి. నర్సంపేట నియోజకవర్గంలో మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి పర్యటించారు. దుగ్గొండి మండలం చలపర్తిలో రైతులకు పంటనష్ట పరిహారం చెక్కుల పంపిణీ చేశారు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అకాల వర్షం వడగళ్ళవానతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తున్నామని వివరించారు.
ఒక్క ఎకరం వదిలి పెట్టకుండా సర్వే చేయించాం… నర్సంపేట నియోజకవర్గంలోనే 40 కోట్లు పరిహారం క్రింద అందజేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాన పదివేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక సీఎం కేసిఆర్ నేతృత్వంలో ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందుతుంది..రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలో పండిన పంటకు సరిపడా గోదాములు ఉన్నాయి…. తడిసిన వడ్లను సైతం కొనాలని సీఎం కేసిఆర్ అధికారులను ఆదేశించారన్నారు ఎర్రబెల్లి.