తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కేటాయింపుపై కసరత్తు బుధవారంలోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసినట్లు ఎన్నికల సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. “ప్రతీ నియోజకవర్గానికి బ్యాలెట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్ ల పంపిణీ ప్రక్రియను 78 అసెంబ్లీ నియోజకవర్గాలలో చేపట్టామని అధికారులు వివరించారు.
ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటి తొలిదశ తనిఖీలు పూర్తి చేసిన మీదట కేటాయిస్తున్నాం. మరో 41 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆదనపు బ్యాలెట్ యూనిట్లు పంపాం. అక్కడ కూడా తొలి విడత తనిఖీలు పూర్తి చేసి కేటాయించాలని చెప్పాం. సి-విజిల్ ద్వారా 5,183, ఇతర విధానాల ద్వారా 27,330 ఫిర్యాదులు వచ్చాయి. అధికారులు దాదాపు అన్నిటినీ పరిశీలించారు. ఇప్పటివరకు నగదు, బంగారం, మద్యం, ఉచితాలు తదితరాలు కలిపి రూ. 603 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నాం” అని ఎన్నికల సంఘం పేర్కొంది.