హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలినట్లు నిందితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ కేసులో ప్రధాన సరఫరాదారునిగా ఉన్న మీర్జా వహీద్ బేగ్‌ను విచారించిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పొందుపరిచారు.
గోవా జైల్లో ఉన్న ఖైదీ అబ్దుల్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని రాణిగంజ్‌కు చెందిన డ్రగ్స్ సరఫరాదారు అబ్దుల్ రెహ్మన్‌కు భారీగా కొకైన్ అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి నుంచి అత్తాపూర్‌లోని కేఫ్ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న మీర్జావహీద్ బేగ్, ఆ తర్వాత సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీకి చేరుతున్నాయి. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్, అబ్బాస్ అలీ జాఫ్రీ నుంచి కొని డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గోవాలో ఉండే అబ్దుల్.. రాణిగంజ్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ ఇద్దరూ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరిస్తూ భారీగా విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు.