ఇవాళ హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో GHMC అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న, చెట్టు కూలిపోయిన, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచినా వెంటనే తమను సంప్రదించాలని సూచించారు.
040-21111111 లేదా 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. మ్యాప్ లొకేషన్ తో పాటు ఫోటోలను షేర్ చేయాలని ట్వీట్ చేశారు. కాగా, ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పలు చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏకధాటిగా వాన పడుతోంది. ఉదయం 3 గంటల నుంచి కురుస్తున్న వర్షంతో ఇందల్వాయి, డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిరికొండ మండలంలోని చీమనుపల్లిలో 113 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోనూ భారీగా వాన పడుతోంది.