సింగరేణి కుటుంబాలకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. 35 ఏళ్లు దాటిన డిపెండెంట్లకు కారుణ్య నియామకం అమలు చేయడానికి సింగరేణి యాజమన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కరోనా మహమ్మారి కారణంగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు రూ. 15 లక్షలు ఇవ్వడానికి కూడా యాజమాన్యం అంగీకరించింది. కాగ ఇటీవల సింగరేణిలో కార్మిక సంఘాలు.. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె నోటీస్ ఇచ్చాయి. కాగ దీనిపై సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య పలు విడుతల్లో చర్చలు జరిగాయి. బుధవారం జరిగిన చివరి విడత చర్చలు సఫలం అయ్యాయి.
కార్మిక సంఘాల డిమాండ్లను నెరవేర్చడానికి యాజమాన్యం అంగీకరించింది. అందులో భాగంగానే 35 ఏళ్లు దాటిన వారి వారసులకు కారుణ్ఓయ నియామకాల్లో ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకుంది. అలాగే కరోనా మరణాల కుటుంబాలకు రూ. 15 లక్షల ఆర్థిక సాయానికి అంగీకరించింది. దీంతో పాటు రాష్ట్రంలో నాలుగు బొగ్గు బ్లాక్ ల వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి కార్మిక సంఘాలు ఢిల్లీకి వెళ్లనున్నాయి. దీనికి కూడా సింగరేణి యాజమాన్యం పూర్తిగా సహకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చర్చలు సఫలం కావడంతో సంస్థ సీఎండి శ్రీధర్ కు, డైరెక్టర్లకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.