తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్డీఏలో చేరతామంటూ కేసీఆర్ తమ వద్దకు వచ్చారని.. దానికి తాము ఒప్పుకోలేదని మోదీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు. అసలు బీజేపీయే.. తమతో పొత్తుకు అప్పట్లో ముందుకు వచ్చిందని.. కానీ తాము ఎవరితో పొత్తులు పెట్టుకోదలుచుకోలేదని అప్పుడే స్పష్టం చేశామని తాజాగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ప్రధాని వ్యాఖ్యలను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత మోదీకి లేదని గుత్తా పేర్కొన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలంటే మోదీ ఆశీర్వాదం అక్కర్లేదని తేల్చి చెప్పారు. వెంటిలేటర్‌పై ఉన్న బీజేపీని బతికించుకునేందుకే కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు చేశారని అన్నారు. అవినీతిపరులు తన పక్కన కూర్చోలేరనే మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని గుత్తా ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ కేసులున్న వారినే బీజేపీలో చేర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు.