రుణమాఫీ అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమని అన్నారు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎక్కడా దాక్కోలేదని.. అనుక్షణం రుణమాఫీ గుర్తు చేస్తూ మిగతాది చేసే వరకు మీ గుండెల్లో నిద్ర పోతానని అన్నారు.
వడ్లకు బోనస్ ఇస్తామని బోగస్ గా మార్చిన సన్నాసి ఎవరని ప్రశ్నించారు హరీష్ రావు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి లోనే పూర్తిగా రుణమాఫీ జరగలేదని అన్నారు. దీనిపై చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేసిందా అని ప్రశ్నించారు. పింఛన్లు పెంపు, రెండు లక్షల ఉద్యోగాలు, రుణమాఫీ అసంపూర్తిగా చేశారని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రజల ఇబ్బందులను తొలగించడం పై దృష్టి పెట్టాలని సూచించారు హరీష్ రావు. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని మోసం చేసింది రేవంత్ రెడ్డి కాదా..? అని నిలదీశారు. రెండు లక్షల రూపాయలకు పైన ఉన్న రుణాలను మించి ఉన్న సొమ్మును ముందుగా చెల్లించమనడం సిగ్గుచేటు అన్నారు హరీష్ రావు.