మరో మూడ్రోజులూ తెలంగాణలో వానలు

-

రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఇవాళ (జులై 22వ తేదీ) ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ జిల్లాలకు ‘పసుపు’ రంగు హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొన్నారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ మధ్య అల్పపీడనం కేంద్రీకృతమైందని చెప్పారు.

మరోవైపు గత మూడ్రోజులుగా పగటివేళ ముసురు పడుతుండగా.. రాత్రిళ్లు వాన దంచికొడుతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. ఇక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు దాదాపు వెయ్యికి పైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. పలుచోట్ల పంటలు నీటమునిగాయి. భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా నదుల పరీవాహకాల్లోని ప్రాజెక్టులకు ప్రవాహం పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version