ఐఏఎస్ లకు హైకోర్టు షాక్.. రిపోర్టు చేయాలని ఆదేశం..!

-

క్యాట్  తీర్పును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు  షాకిచ్చింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను కోర్టులు నిర్ధారించలేవని జడ్జి పేర్కొన్నారు. ఐఏఎస్ లు అయినంత మాత్రాన స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని అభిప్రాయపడింది. ముందు వెళ్లి ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  అయితే.. క్యాట్ తీర్పు ప్రకారం ఇవాళే రిపోర్ట్ చేయాల్సి ఉంది.

ఇటీవల డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రొనాల్డ్ రోస్, సృజన, శివశంకర్, హరికిరణ్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్.. డీవోపీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల వీరంతా తమను యథావిధిగా బదిలీ చేయకుండా ఉంచాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్  ఆశ్రయించారు. వారి విజ్ఞప్తిని అక్కడ నిరాకరించడంతో తాజాగా బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు విచారణ చేపట్టింది.  ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని హైకోర్టు అడగ్గా.. ఇంకా ఆర్డర్ కాపీ ఇవ్వలేదని ఐఏఎస్ ల తరపున లాయర్లు జడ్జీకి తెలిపారు.  తాజాగా పిటిషన్ ను డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టు. వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది హైకోర్టు. మీరు రిపోర్టు చేసిన తరువాత ఏమైనా సమస్యలుంటే మేము విచారణ చేపడుతామని కోర్టు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version