దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరం నాలుగో దశ ఎన్నికల పోలింగ్ రేపు (మే 13వ తేదీ 2024) జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఓటింగ్ ప్రక్రియకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అంశాలపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కేశవాపురం వద్ద ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ కారులో భారీగా నగదు బయటపడింది. కారులోని రెండు బ్యాగుల్లో డబ్బును గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటి రూపాయలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నగదు తరలింపుపై విచారణ చేస్తున్నారు.