ఆషాఢ మాసం వచ్చేసింది. తీన్మార్ దరువులతో హైదరాబాద్ నగరం మారుమోగనుంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో భాగ్యనగరం జాతర శోభను సంతరించుకోనుంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నగరంలో బోనాల జాతర సాగనుంది. ఆషాఢమాసంలో వచ్చే తొలి గురు, లేదా ఆదివారాల్లో బోనాల జాతరకు అంకురార్పణ చేవడం ఆనవాయితీ. ఈ ఏడాది బోనాల పండుగను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. నేడు గోల్కొండలోని జగదాంబిక, మహంకాళీ అమ్మవార్లు తొలి బోనాన్నీ అందుకోనున్నారు.
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు, ఆది వారాల్లో బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వరాలు… 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. నేడు తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోట బజార్ లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజ వైపు నుంచి నజర్ బోనం తీసుకుని అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు ఎక్కిస్తారు.