జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్ష తుది కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్య 300కి 300 మార్కులు సాధించాడు. ఆయన మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈనెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బీటెక్ సీట్ల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీని కొద్దిరోజుల క్రితం వెల్లడించిన ఎన్‌టీఏ దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తుది కీని వెబ్‌సైట్‌లో ఉంచింది.
జేఈఈ మెయిన్‌లో కనీస కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. వారు ఈనెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మే 7వ తేదీ తుది గడువు. జూన్ 4వ తేదీన జరిగే పరీక్ష ఫలితాలను జూన్ 18వ తేదీన వెల్లడిస్తారు