ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లోని కాటేదాన్‌కు చెందిన ఓ యువకుడు అమెరికాలోని చికాగోలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. గత శనివారం (21న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి మృతదేహం శనివారం(27 వతేదీ) రాత్రి హైదరాబాద్ చేరుకుంది. ఆదివారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… కాటేదాన్‌కు చెందిన అక్షిత్‌రెడ్డి(26) ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చికాగోలో ఉంటూ ఎమ్మెస్ పూర్తిచేసిన అక్షిత్‌రెడ్డి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. డిసెంబరులో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ క్రమంలోనే అక్షిత్‌రెడ్డి గత శనివారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో ఈతకు వెళ్లాడు. చెరువు మధ్యలోని ఓ రాయి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుని.. అతి కష్టమ్మీద రాయివరకు తన ఫ్రెండ్ చేరుకోగా అక్షిత్‌రెడ్డి మధ్యలోనే అలిసిపోయి వెనక్కి వస్తుండగా మునిగిపోయాడు. అతడి ఫ్రెండ్ కూడా తిరిగి వచ్చే క్రమంలో చెరువులో మునిగిపోగా.. స్థానికులు కాపాడారు. పోలీసులు గాలించి అక్షిత్‌రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు.