జంట నగరాల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత జిల్లాల ప్రజల సౌకర్యార్థం ప్రతిపాదిత ఎలివేడెట్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు కండ్లకోయ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ ప్యారడైస్ జంక్షన్ నుంచి జాతీయ రహదారి 44 ను అనుసంధానం చేసే వీలుగా డెయిరీ ఫామ్ వరకు రూ. 1580 కోట్ల వ్యయంతో 5.3 కి.మీ పొడవున ఈ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మిస్తారు.
ముందుగా ఆరు వరుసల్లో ఈ ఎలివేడెట్ కారిడార్ నిర్మాణం పూర్తయిన తర్వాత దాని పైభాగంలో మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు. ప్యారడైజ్ ప్రాంతం నుంచి ఈ మార్గంలో ప్రతి రోజూ 1.5 లక్షల మేరకు వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ రద్దీని తట్టుకుని ప్రజలకు ముఖ్యంగా మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.