రాష్ట్రంలోని గీత కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. రైతు బీమా తరహాలో గీత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఓ నూతన పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో రైతు బీమా అమలవుతున్న తీరులోనే గీత కార్మికుల బీమా అమల్లోకి రానుంది. కల్లు గీస్తూ కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందనుంది. ఈ పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది.
ఈమేరకు గీత కార్మిక బీమాను అమల్లోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ మంగళవారం రోజున సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావులను ఆదేశించారు.
కల్లు గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్టకర ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నా బాధితులకు చేరడంలో ఆలస్యమవుతోందన్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతు బీమా తరహాలోనే గౌడ కుటుంబాలకూ వారం రోజుల్లోనే బీమా సొమ్ము అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం చెప్పారు.