ఈనెల 8వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2024-25 జరగనున్నాయి. 10వ తేదీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సమావేశాల కోసం ధరణి పోర్టల్ పునర్నిర్మాణం, భూ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం నియమించిన ధరణి కమిటీ మధ్యంతర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించేందుకు వీలుగా కమిటీ ఈ నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై గురు, శుక్రవారాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నివేదికలో ఏయే అంశాలు ఉండాలి, ప్రభుత్వానికి చేసే సూచనలు ఏమేం ఉండాలనేది నిర్ణయించనున్నట్లు సమాచారం.
గత నెల 9వ తేదీన అయిదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ నియమించగా.. ఇప్పటికే ఆరు దఫాలుగా సమావేశమైన కమిటీ పోర్టల్లో ఉన్న సమస్యలతోపాటు ప్రభుత్వ శాఖలు వాటి పరిధిలోని భూముల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించింది. ఇక రేపు స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, పరిశ్రమల శాఖలతో కమిటీ భేటీ కానుంది.