మునిసిపల్ మంత్రి గాడిద పళ్లు తోముతున్నాడా..? – బండి సంజయ్

-

జలమండలి వద్ద ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. నాలాల్లో, నీటి గుంతల్లో పడి పిల్లలు చనిపోతున్నా స్పందించరా? అని ప్రశ్నించారు. జూబ్లిహిల్స్ ప్రాంతంలో నీటి గుంతలో పడి ఈరోజు వివేక్ అనే చిన్నారి చనిపోవడం అత్యంత బాధాకరం అన్నారు బండి సంజయ్. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పసిపిల్లలు బలవుతుంటే మునిసిపల్ మంత్రి ఏం చేస్తున్నట్లు? గాడిద పళ్ళు తోముతున్నాడా? అని నిలదీశారు.

అకాల వర్షాలకు భాగ్యనగర్ ఆగమవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? జీహెచ్ఎంసీ, జల మండలి తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. వడగండ్ల వానలతో రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయి లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదు? అని ప్రశ్నించారు. అకాల వర్షాలతో రైతులు ఎకరానికి సగటున రూ.50 వేలు నష్టపోయారని.. కానీ నేటికీ పైసా కూడా సాయం చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఎకరానికి రూ.10 వేలు ఇస్తానంటూ మార్చిలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాకపోవడం సిగ్గుచేటు అన్నారు బండి సంజయ్.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలోనూ ప్రభుత్వ అలసత్వం స్పష్టంగా కనపడుతుందన్నారు. మార్కెట్లకు వచ్చిన ధాన్యం సైతం వర్షాలకు తుడిచిపెట్టుకు పోతుంటే వ్యవసాయ శాఖ మొద్దు నిద్దుర పోవడం క్షమించరానిదన్నారు. తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రతిసారి చెబుతున్నా… ఆచరణలో మాత్రం ఆ దిశగా చర్యల్లేవన్నారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version