శాసనసభలో విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులకు, మాజీమంత్రి జగదీశ్ రెడ్డికి మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. జగదీశ్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి మండిపడుతూ కౌంటర్ వేశారు. చర్లపల్లి జీవితం రేవంత్‌రెడ్డికి అనుభవం ఉందన్న ఆయన.. మళ్లీ చర్లపల్లి జైలుకే వళ్తామని రేవంత్ అంటున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఉద్యమంలో చెంచల్ గూడ జైలుకు వెళ్లిన అనుభవం ఉందని కానీ.. చర్లపల్లి జైలు సంగతి తెలియదని వ్యాఖ్యానించారు.
మరోవైపు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జగదీశ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. జగదీశ్వర్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని.. ఆయణ్ను ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించారని వ్యాఖ్యానించారు. దీనిపై జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. కోమటిరెడ్డి మాట్లాడిన ప్రతీ అక్షరం రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ చేశారు.