తెలంగాణలో గతేడాది అక్టోబరులో రాహుల్ గాంధీ జోడోయాత్ర చేశారని కాంగ్రెస్ అగ్రనేత జైరామ్ రమేశ్ అన్నారు. రాష్ట్రంలో రాహుల్ 12 రోజుల్లో సుమారు 405 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని.. జోడో యాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని నమ్మకం కలిగిందని తెలిపారు. బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్‌గా.. ఎంఐఎం ‘సీ’ టీమ్‌గా మారాయని ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబంలోని నలుగురు నియంత్రిస్తున్నారvf.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంను తిరస్కరించాలని కోరారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జైరామ్ రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“పెట్టుబడులు అన్నీ హైదరాబాద్‌లో కేంద్రీకృతమయ్యాయి. పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో.. ఇప్పుడూ అలా ఉంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. నిరుద్యోగంతో రాష్ట్రంలో రోజుకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు . పదేళ్ల తెలంగాణలో కేవలం నిరుద్యోగుల ఆత్మహత్యలే ఉన్నాయి. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగులు నష్టపోయారు. 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదు. తెలంగాణ వచ్చాక కేవలం సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది.” అని జైరామ్ రమేశ్ అన్నారు.